www.viraltelugu.com, Online News : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి పొన్నం ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతివ్వాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి పొన్నం అందజేశారు. వినతి పత్రాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు.
జంట నగరాల్లో ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రక్షణ శాఖ భూములు ఎంతో ఉపయోగపడతాయని, కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల కింద వచ్చే దాదాపు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని రక్షణమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ బకాయిలను సకాలంలో విడుదల చేయడం వల్ల రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని పొన్నం వివరించారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్‌కు అందించిన వినతి పత్రంలో పొన్నం అభ్యర్థించారు.



