www.viraltelugu.com, Online News : ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌గా రూ.1,865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది. ఈ మొత్తాన్ని రైల్వే సిబ్బందిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డ్), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి సిబ్బంది వంటి వివిధ వర్గాలకు చెల్లించనుంది. ఈ బోనస్‌ను దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటనతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. సాహెబ్ గంజ్-బెట్టయ్య NH 139 నాలుగు లైన్ల రహదారి 79 కిమీ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,822 కోట్లతో నిర్మితం కానున్న NH 139, రెండేళ్లలో పూర్తి కానున్నట్లు సమాచారం. బిహార్‌లోని భక్తియార్‌పూర్-రాజ్‌గిర్-తలయ రైల్వే లైన్ డబ్లింగ్‌కి కేబినెట్ ఆమోదం లభించింది. రూ.2,192 కోట్లతో 104 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో బిహార్-జార్ఖండ్ మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగనుంది. షిప్పింగ్ మారిటైమ్ అభివృద్ధి సంస్కరణల కోసం రూ.69725 కోట్లు కేటాయించారు.



