హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ‘హిందీ దివస్’ను పురస్కరించుకుని ఈరోజు గుజరాత్లోని అహ్మదాబాద్లో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర న్యాయ రాష్ట్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, పార్లమెంటరీ రాజభాషా కమిటీ ఉపాధ్యక్షులు భర్తృహరి మహతాబ్, స్థానిక ఎంపీ దినేష్ మక్వానా, ప్రఖ్యాత గుజరాతీ విద్యావేత్త ప్రొఫెసర్ విజయ్ పాండ్యా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘భాష అనేది నాగరికత, సంస్కృతికి ఆత్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా భాష కేవలం వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, జాతీయ చైతన్యానికి ఆత్మ. మోదీ నాయకత్వంలో భారత్ నేడు ఆత్మనిర్భరత వైపు, విశ్వగురువుగా మారే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర భారతానికి అతి పెద్ద శక్తి దాని స్థానిక భాషలు, మాతృభాషలే. మోదీ నాయకత్వంలో రూపొందిన జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు విద్య, జ్ఞానానికి మూలాధారంగా ప్రాధాన్యం ఇవ్వబడింది. విదేశీ భాషలు మన జ్ఞానం, అవకాశాలను విస్తరిస్తాయి. అందువల్ల ప్రతి భాషను సంరక్షించడం, గౌరవించడం మన ప్రధాన కర్తవ్యంగా భావించాలి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీ, భారతీయ భాషలను సాంకేతికత, పరిపాలనలో విరివిగా ప్రాచుర్యం పొందేలా చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో రాజభాషా విభాగం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను చేపట్టింది. హిందీ శబ్ద సింధు డిజిటల్ నిఘంటువులో ప్రస్తుతం ఏడు లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. అందులో సుమారు 25f వేల పదాలు భారతీయ భాషల నుండి సేకరించబడ్డాయి. ఇది కేవలం హిందీకి విస్తరణ మాత్రమే కాదు, భారతీయ భాషల మధ్య ఒక సంధాన సేతును నిర్మించడం కూడా. భారతీయ భాషా విభాగ ప్రాజెక్ట్ హిందీ, భారతీయ భాషల మధ్య సమన్వయానికి అద్భుతమైన ఉదాహరణ. కంఠస్థ్, అనువాద్ సాధన్ మరియు ఇతర సాంకేతిక టూల్స్ , రాజభాషా అమలును సులభతరం చేసి ఆధునికతను చేర్చాయి. విద్య, కమ్యూనికేషన్, పరిపాలన భాషగా హిందీ ప్రాధాన్యం నిరంతరం పెరుగుతోంది. విదేశాలలో కూడా కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారు. అర్థం చేసుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై హిందీకి వచ్చిన అంగీకారం, భారతదేశ సాంస్కృతిక శక్తికి ప్రతీక. నేను హిందీయేతర రాష్ట్రమైన తెలంగాణ నుంచి వచ్చాను. కానీ అమిత్ షా ప్రేరణతో అన్ని ప్రభుత్వ పనుల్లోనూ, మాట్లాడే భాషలోనూ హిందీని సులభంగా ఉపయోగిస్తున్నాను.’
‘మన మాతృభాష శాస్త్రీయ పరిశోధన భాషగా, పరిశ్రమ-వ్యాపార భాషగా, డిజిటల్ సంభాషణ భాషగా, అంతర్జాతీయ దౌత్య భాషగా మారేలా చూడాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. భారత యువ శాస్త్రవేత్తలు హిందీ, భారతీయ భాషల్లోనే పరిశోధనలు చేయాలి. వ్యాపారవేత్తలు తమ వ్యాపార మోడళ్లను ఈ భాషల్లోనే సృష్టిస్తే, సాంకేతిక పరికరాలు ఈ భాషల్లోనే సులభంగా అందుబాటులో ఉంటే, అప్పుడు మాత్రమే నిజమైన అర్థంలో ఆత్మనిర్భర్ భారత్ స్వప్నం సాకారం అవుతుంది. అంతిమంగా హిందీతో పాటు అన్ని భారతీయ భాషలకు సమాన గౌరవం, అవకాశాలు లభిస్తేనే భారత ఏకత్వం మరింత బలపడుతుంది. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో హిందీ, భారతీయ భాషల యాత్ర నిరంతరం ముందుకు సాగుతుందని, భారతదేశాన్ని ఆత్మనిర్భర్, విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో ఇది విశేషమైన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.’ అంటూ బండి సంజయ్ తెలిపారు.