www.viraltelugu.com, Online News : నిస్వార్థమే లక్షణం.. సమాజ సేవే లక్ష్యం. విద్య ద్వారా సేవా అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ.. ప్రజా హృదయ పథంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకం ‘ఎన్ఎస్ఎస్’. నేడు ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం. విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమాజాభ్యుదయమే ధ్యేయంగా 1969 సెప్టెంబరు 24 నుంచి ఎన్‌ఎస్‌ఎస్ సేవలందిస్తోంది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ కార్యక్రమం విద్యార్థులను సమాజ సేవలో భాగస్వాములను చేస్తోంది. తమ కళాశాలలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోనూ, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్య పరచడంలోనూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల కృషి వెల కట్టలేనిది. సమాజంలో ఉన్నవారిని చైతన్య పరచడంతో పాటు, సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుంచే అలవాటు చేయడం ద్వారా దేశ భవిష్యత్ కు పునాదులు వేసినట్లవుతుంది.
56 ఏళ్లుగా ఎన్ఎస్ఎస్ తన సేవలను సమాజానికి అందిస్తూ వస్తుంది. విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం చేస్తూ వారిలో మంచి క్రమశిక్షణను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఇది పని చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఎస్ఎస్ విభాగం ఎంతోమంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది. ఎన్‌ఎస్‌ఎస్ మోటో “నాట్ మీ, బట్ యూ” – అంటే, నా కోసం కాదు, మీ కోసం. ఈ బ్యాడ్జ్‌లో కోణార్క్ సూర్యదేవాలయ రథ చక్రం ఉంటుంది. ఇది 24 గంటల సమాజ సేవకు సంకేతం. ఎరుపు రంగు యువత శక్తిని, నీలం రంగు మానవ శ్రేయస్సు కోసం సేవా సంసిద్ధతను సూచిస్తాయి.
ఎన్‌ఎస్‌ఎస్ లక్ష్యం సమాజ అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారంలో విద్యార్థులను చురుగ్గా పాల్గొనేలా చేయడం. శ్రమదానం, రక్తదానం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగం. దేశవ్యాప్తంగా ఏడు రోజుల జాతీయ సమైక్యతా శిబిరాలు నిర్వహిస్తారు. ఎన్‌ఎస్‌ఎస్ రెండు రకాల క్యాంపులను నిర్వహిస్తుంది. రెగ్యులర్ క్యాంపులు, సంవత్సరంలో ప్రత్యేక రోజుల్లో కార్యక్రమాలు చేపడతాయి. స్పెషల్ క్యాంపుల ద్వారా గ్రామాలను దత్తత తీసుకొని, వారం రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అడ్వెంచర్ క్యాంపులు, ముఖ్యంగా హిమాలయాల్లో, ట్రెక్కింగ్, పడవ ప్రయాణం, పారాచూట్ వంటి సాహస కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 12 నుంచి 16 వరకు నేషనల్ యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు, ప్రోగ్రాం ఆఫీసర్లకు, యూనిట్లకు నేషనల్ సర్వీస్ అవార్డులు అందజేస్తారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారం ప్రకారం.. గత 56 ఏళ్లుగా ఎన్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములను చేస్తోంది.
ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం విద్యార్థులలో సమాజ సేవా స్పూర్తిని రగిలిస్తుంది. నిస్వార్థ సేవ, జాతీయ సమైక్యత, క్రమశిక్షణతో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. ఈ రోజు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను స్మరిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుదాం..



