www.viraltelugu.com, Online News : తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ… ఎన్నో రకాల పువ్వులతో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, తొమ్మిది రోజులు ఒక్కో పేరుతో బతుకమ్మను పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతుంది. అయితే, బతుకమ్మ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంటి..? వేటితో ఎలా చేస్తారు..? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఎంగిలి పూల బతుకమ్మ..
ఎంగిలి పూల బతుకమ్మతో మొదటి రోజు ప్రారంభమవుతుంది. దీన్ని పెత్రమాస అని కూడా పిలుస్తారు. అయితే, బతుకమ్మ పండుగ మొదటి రోజన నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపిన వాటిని గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు..
అటుకుల బతుకమ్మ..
బతుకమ్మ పండుగలో రెండో రోజు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆశ్వీయుజ మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి నాడు ఈ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున సప్పిడి పప్పు అంటే ఉప్పు లేకుండా వండిన పప్పు, బెల్లం, అటుకులతో చేసిన పదార్ధం నైవేద్యంగా అమ్మ వారికి పెడతారు..
ముద్దపప్పు బతుకమ్మ..
బతుకమ్మ పండుగలో మూడో రోజు ముద్ద పప్పు బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున ఉడికించిన ముద్ద పప్పు, పాలు, బెల్లం వంటివి కలిపి అమ్మ వారికి నైవేద్యంగా సమర్పిస్తారు..
నాన బియ్యం బతుకమ్మ..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. ఈ బతుకమ్మ నాడు బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు..
అట్ల బతుకమ్మ..
బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మను జరుపు కుంటారు. అయితే, ఈ రోజున అమ్మ వారికి అట్లు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ..
ఆరో రోజున అలిగిన బతుకమ్మను జరుపుకుంటారు. అయితే, ఈ రోజున బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు. అందుకే ఈ రోజున అలిగిన బతుకమ్మ అని అంటారు.
వేపకాయల బతుకమ్మ..
బతుకమ్మ పండుగలో ఏడో రోజున వేపకాయల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున బియ్యం పిండిని బాగా వేయించి, చిన్న చిన్న వేప పండ్ల ఆకారంలో తయారు చేస్తారు. వీటిని అమ్మ వారికి నైవేద్యంగా పెడతారు..
వెన్న ముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నె ముద్దల బతుకమ్మను జరుపుకుంటారు. నైవేద్యంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి వెన్న ముద్దలుగా చేసి పెడతారు..
సద్దుల బతుకమ్మ..
పండుగ చివరి రోజు, తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను జరుపు కుంటారు. ఈ రోజున ఐదు రకాల పులిహోర లను (సద్దులు) తయారు చేసి నైవేద్యంగా పెడతారు. పెరుగన్నం, చింత పండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా పెడతారు. ఈ తొమ్మిది రోజులు ప్రతి రోజు ప్రత్యేకమైన నైవేద్యాలతో బతుకమ్మను పూజించి చివరికి నిమజ్జనం చేస్తారు. చివరి రోజున ఆడపడుచులు బతుకమ్మను మధ్యలో పెట్టి నృత్యాలు చేస్తారు..



