విజయవాడ: పరిశ్రమలలో విశేష అనుభవం కలిగిన పారిశ్రామిక వేత్త, సేవా మూర్తి బండారు నరసింహారావు ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు దేశంలోని పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో అనుబంధంగా కొనసాగుతూ, డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన జనసేన అగ్రనేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.
17 September, 2025 బుధవారం వర్చువల్ మాధ్యమంలో జరిగిన ACA సాధారణ సమావేశంలో నరసింహారావును ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ కీలక సమయంలో ACAలో ఉపాధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), గౌరవ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కి ధన్యవాదాలు” అని తెలిపారు. క్రికెట్ కార్యకలాపాలను రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు ACA బృందంతో సన్నిహితంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో యువ ప్రతిభను వెలికి తీయడానికి, ప్రోత్సహించడానికి అవసరమైన క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాల ప్రధాన కేంద్ర పట్టణాలన్నిటిలో స్టేడియంల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను కనుగొని వారికి తగిన శిక్షణ, వేదికలు కల్పించేందుకు కృషి చేస్తామని వివరించారు.
“ప్రత్యేకంగా రూపొందించిన క్రికెట్ అకాడెమీలలో యువ ప్రతిభ కోసం ప్రత్యేక, నిబద్ధతతో కూడిన కోచింగ్ సదుపాయాలు ఏర్పాటుచేయడానికి మేము సిద్ధమవుతున్నాం. గతంలా కాకుండా, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ACA నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం” అని నరసింహారావు స్పష్టం చేశారు.