గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ పురోగతి అభివృద్ధి చెందినట్లుగా అవుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. గత రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ విభాగ ప్రజాప్రతినిధులు, ఆ రాష్ట్ర అధికారులు జిల్లాలోని పలు గ్రామపంచాయతీల పనితీరును పరిశీలించారు. ఈ మేరకు 28 మందితో కూడిన బృందం జిల్లాలోని పూలుముర్ది, లింగంపల్లి, నవాబ్‌పేట్ పరిధిలోని గ్రామ పంచాయతీలను పరిశీలించారు. గ్రామంలో ఉన్న క్లీన్ అండ్ గ్రీన్, పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను అదే విధంగా పేదరిక నిర్మూలన, జీవనోపాధి వృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా దూరదర్శన్‌తో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డిస్ట్రిక్ ప్రాజెక్టు మేనేజర్ అరుణ దేవ్ మిశ్రా మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామాల అభివృద్ధి భిన్నంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో గ్రామాలలో కలిసికట్టుగా ఉండడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చూశామని పేర్కొన్నారు. అలాగే వీరి జీవనశైలి కూడా మా రాష్ట్ర ప్రజల జీవనశైలికి భిన్నంగా ఉందని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో చెట్ల పెంపకం, జీవనోపాధి కోసం కష్టపడే తత్వం, క్లీన్ అండ్ గ్రీన్ ఆకట్టుకుందని అన్నారు. మా రాష్ట్ర గ్రామాలలో పాడి పశువులతో ఉపయోగించే విధానం కూడా ఇక్కడ ఇంకా అలవర్చాలని అన్నారు. ఇక్కడ కొనసాగుతున్న విధానాన్ని కూడా మా రాష్ట్ర గ్రామాలలో అవలంబించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛ్ భారత్ మిషన్ కౌన్సిల్ ప్రతినిధి తుహిన్ రాయ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాలను పరిశీలించేందుకు రావడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో ఉన్న వ్యవస్థ ఇక్కడ అవలంబించే పంచాయతీరాజ్ నిధులు అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో చేసే అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ పనితీరు ఇక్కడ ఉన్న గ్రామాలలో అవలంబిస్తున్న తీరు తమను ఆకట్టుకున్నాయని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు వీరి బృందాన్ని కోఆర్డినేట్ చేసే వికారాబాద్ జిల్లా సీడీపీఏ సీఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ విభాగ ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లాలోని పలు గ్రామాలను 28 మందితో కూడిన బృందం పరిశీలించారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల ద్వారా గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి చెందుతున్నాయనే అంశాలను తెలుసుకోవడానికి వీరు రావడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, గ్రామాల జీవన అభివృద్ధి శైలి, స్వచ్ఛ భారత్ మిషన్, వంటి వాటిని పరిశీలించినట్లుగా తెలిపారు. అదేవిధంగా గ్రామాలలో క్లీన్ అండ్ గ్రీన్ వృక్ష పెంపకం కూడా వీరు పరిశీలించినట్లుగా పేర్కొన్నారు.