నేడు ఇంజనీర్ల దినోత్సవం

ప్రతి ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్ల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇండియాలో ఇంజనీర్ల దినోత్సవం జరుపుతున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్‌ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్‌ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహించారు. విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మైసూర్‌ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో సాధారణ కుటుంబంలో జన్మించారు. ఇంజనీరింగ్‌ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగం పొందారు. 

హైదరాబాద్‌ను వరదల నుండి కాపాడిన వాస్తుశిల్పిగా ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1908లో హైదరాబాద్‌లో వరదలు సంభవించాయి. ఆ సమయంలో మూసీ నది ఉప్పొంగి ప్రవహించి వేలాది ఇళ్లు మునిగిపోయాయి. దాదాపు 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి వరదలు రాకుండా అప్పటి నిజాం నవాబు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించారు. హైదరాబాద్ నగరం అంతా తిరిగి చూసిన విశ్వేశ్వరయ్య.. మూసీ, ఈసీ నదులపై రెండు భారీ జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదించాడు. దీని ఫలితంగా ఉస్మాన్ సాగర్ (1920లో పూర్తయింది), హిమాయత్ సాగర్ (1927లో పూర్తయింది) నిర్మించారు. ఇవి వరదలను నియంత్రించడమే కాకుండా జంట నగరాల ప్రధాన తాగునీటి వనరులుగా కూడా మారాయి. ఇక విశాఖపట్నం ఓడ రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో విశ్వేశ్వరయ్య పాత్ర చాలా కీలకం. విశాఖ రేవు నిర్మించేప్పుడు అలల పోటు ఎక్కువగా ఉండేది. అలల తీవ్రతను తగ్గించేందుకు రెండు పాత నౌకల్లో బండరాళ్లను వేసి సాగర తీరానికి చేరువగా ముంచేయాలన్నారు. అలా చేయడంతో అలల తీవ్రత తగ్గింది. తర్వాత నిర్మాణాలు చేపట్టారు.

దేశానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలే అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి తీసుకురావడం ద్వారా అనేక సేవలు చేశారు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలకు గాను 1968లో ఆయన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంజనీరింగ్ మేధావిగా ఆయన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం భారతదేశం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటుంది.

Share Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *