కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని.. నిరాధారమైనవని.. అవి తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ కేటీఆర్ పిటిషన్ వేశారు. తనకు బహిరంగ క్షమాపణతో పాటు రూ.10 కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు సోమవారం విచారణ జరిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 15వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల ఫోన్లను, తన కుటుంబ సభ్యుల ఫోన్లను కేటీఆర్ టాపింగ్ చేయించారని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలపై ఆగస్టులో కేటీఆర్ నోటీసులు పంపారు. బండి సంజయ్ నుంచి నోటీసులకు రిప్లై రాకపోవడంతో కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని కేటీఆర్ తెలిపారు. అలాగే పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని విజ్జప్తి చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని కోరారు.