అస్సాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఈరోజు(ఆదివారం) సాయంత్రం 4:41 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ఉదల్‌గిరి జిల్లాలోని ధెకియజులి ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనాలోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అస్సాం రాష్ట్రం కూడా ఉంది. ఈనెల 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.