జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి యాత్రకు ఆటంకాలు తప్పడం లేదు. భారీ వర్షాల కారణంగా యాత్రను తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు టెంపుల్ బోర్డు శనివారం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14 నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ‘భవన్ ట్రాక్ వద్ద ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున 14వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వైష్ణోదేవి యాత్రను మరోసారి వాయిదా వేస్తున్నాం.’ అని శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్ బోర్డ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యాత్రకు వెళ్లాలని భావిస్తున్న భక్తులు అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని కోరింది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు పేర్కొంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర పునఃప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సమీక్షిస్తున్నారని పేర్కొంది.
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో గత 20 రోజులుగా నిలిచిపోయింది. అయితే వాతావరణ అనుకూలతను పరిగణనలోకి తీసుకుని ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు ఇటీవల ప్రకటించింది. అయితే ఇంతలోనే యాత్రా మార్గంలో తిరిగి భారీ వర్షాలు పడుతుండటంతో యాత్రను వాయిదా వేసినట్టు మరోసారి ప్రకటించింది. శ్రీ వైష్ణోదేవి ఆలయం శక్తి పీఠాలలో ఒకటి. శ్రీ వైష్ణోదేవి యాత్ర అనేది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ యాత్రలలో ఒకటి. ఈ యాత్రలో భక్తులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని త్రికూట పర్వతంపై ఉన్న శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి కాలినడకన చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.