జాతీయోద్యమంలో దేశ ప్రజలను జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష దోహదపడింది. అటు తర్వాత జాతీయ భాషగా గుర్తింపు పొందింది.1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. నాటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేడు హిందీ దివస్ సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనం..
1949లో భారత రాజ్యాంగ సభ ద్వారా హిందీని అధికారిక భాషగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ రోజున హిందీ దివస్ జరుపుకోవాలని నిర్ణయించారు. భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో దోహదపడింది. అందుకే గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు.
హిందీ దినోత్సవాన్ని తొలిసారి 1953లో జరుపుకున్నారు. దేశంలో 22 షెడ్యూల్డ్ భాషలు ఉన్నప్పటికీ, హిందీ అత్యంత ఎక్కువగా మాట్లాడబడే భాష. పరిపాలన, విద్య, సాహిత్యం, దైనందిన జీవితంలో హిందీని ప్రోత్సహించడం హిందీ దివస్ ముఖ్య లక్ష్యం. హిందీ దినోత్సవం కేవలం ఒక భాషా వేడుక మాత్రమే కాదు. ఇది మన సాంస్కృతిక మూలాలను గుర్తు చేసుకోవడం, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం, భాషా వారసత్వాన్ని నిలబెట్టడం ముఖ్య ఉద్దేశ్యం.
భారత్ భిన్న భాషలు, సంస్కృతుల సంగమం. సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, బంగ్లా, బోడో, డోగ్రీ, సంథాలీ, గుజరాతీ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సింధి, ఉర్దూ భాషలను రాజ్యాంగం గుర్తించింది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీది నాలుగో స్థానం. మాండరియన్, స్పానిష్, ఇంగ్లీష్, తర్వాత హిందీనే ఎక్కువగా మాట్లాడుతారు. అధికారిక భాష హిందీ… దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడింది. అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం రాజుల ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో మిళితమయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషను 600 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడుతున్నారు. 425 మిలియన్ల మందికి హిందీ మాతృభాషగా ఉంది. 120 మిలియన్ల మందికి రెండవ భాషగా హిందీ ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు. భారత్ లోనే కాకుండా మారిషస్, నేపాల్, ఫిజీ, గయానా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టోబాగో వంటి దేశాల్లోనూ హిందీ భాష మాట్లాడతారు.
మన విజ్ఞానం, సంస్కృతిని విస్తృతం చేయడంలో హిందీ ముఖ్య భూమిక పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ భాషకున్న సరళతే అందుకు కారణమని చెప్పారు. సమాచార, సాంకేతిక రంగాల్లోనూ హిందీ వినియోగం పెరుగుతోందన్నారు. యువతలోనూ దానికి మంచి ఆదరణ ఉందని.. ఈ కారణాలతో భవిష్యత్తులో హిందీ ప్రభ మరింత పెరగనుందని తెలిపారు.
ప్రతి ఏడాది హిందీ దివస్ రోజున రాష్ట్రపతి…. హిందీ భాష కోసం విశేష కృషి చేసిన కళాకారులు, రచయితలకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు. భారత్ లోనే కాకుండా.. మారిషస్, ఫిజీ, నేపాల్, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో, గయానా వంటి హిందీ మాట్లాడే ఇతర దేశాలలో కూడా హిందీ దివస్ వేడుకలు జరుపుకుంటారు. ఇది హిందీని ప్రపంచవ్యాప్త పరిధిని విస్తరించడమే కాకుండా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరుస్తుంది.