హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఆఫ్జల్ సాగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు వరద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్‌లోని అఫ్జల్ సాగర్ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫ్జల్ సాగర్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నాలాల కబ్జా వల్లే వరద సమయంలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ‘హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయి. అలాంటి కబ్జాలు ఉండడం వల్లే ఫ్లాష్‌ఫ్లడ్స్ రూపంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఒక నిర్మాణం కారణంగా నాలాల్లో వరద నీరు అడ్డుపడింది. అఫ్జల్ సాగర్ వద్ద కొన్ని ఇళ్లు తొలగింపునకు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముగ్గురు గల్లంతయ్యారు.. ఇద్దరు మృతి చెందారు. అన్ని సమస్యల పరిష్కారానికి హైడ్రా కృషి చేస్తుంది. మాంగర్‌బస్తీ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే హైడ్రా ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌లో హైడ్రా వ్యవస్థ ప్రాధాన్యత ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. అంతేకాదు, ఈ మోడల్‌ను చూసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ అవసరమనే డిమాండ్ వస్తోంది.’ అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. అఫ్జల్‌సాగర్ డ్రైనేజీలో ఇద్దరు గల్లంతైన ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆఫ్జల్ సాగర్ ప్రాంతంలో 145 ఇళ్లు నాలాపైనే నిర్మించబడ్డాయని తెలిపారు. స్థానికులు ముందుకొస్తే, వారికి ప్రభుత్వ పథకంలో అందించే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.