www.viraltelugu.com, Online News : ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు రక్షణరంగంలో స్వావలంభన కోసం ‘సుదర్శన చక్ర’ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఈ కవచంతో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్బేధ్యంగా తయారుచేస్తామని పేర్కొన్నారు. దీని కోసం ఇప్పటికే త్రివిధ దళాలు పనిని ప్రారంభించాయన్నారు. 2035 నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారని చెప్పారు. ఇతర దేశాలతో ఘర్షణలు తలెత్తిన సమయాల్లో వాటిని ఎదుర్కోవాలి, పరిష్కరించుకోవాలనే విషయాలను భారత్ ఆదర్శంగా ఉందన్నారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిందని.. అది నెరవేరగానే ఘర్షణను నిలిపివేసిందని ఏపీ సింగ్ అన్నారు. ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని భారత్ నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో త్రివిధ దళాల సమన్వయంతో పాక్‌కు చెందిన పది ఫైటర్ జెట్ విమానాలను ధ్వంసం చేశామన్నారు. వాటిలో ఎఫ్-16, జేఎఫ్ -17 యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు తెలిపారు. శత్రువుల స్థావరాలను గురిచూసి కొట్టడంతో పాక్‌లోని ఉగ్రస్థావరాలతో పాటు రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్‌లు, యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఏపీ సింగ్ అన్నారు. ఆ దేశంలోని దాదాపు 300 కి.మీ.ల లక్ష్యాలను ఛేదించి భారత సైన్యం పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టిందన్నారు. ఆపరేషన్ (Operation Sindoor) సమయంలో కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మన సైన్యం శత్రుదేశానికి చుక్కలు చూపించిందని పేర్కొన్నారు. దీంతో కాల్పుల విరమణపై పాక్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. ఈ విషయంలో మరెవరి జోక్యం లేదని.. ఇస్లామాబాద్ కోరడంతోనే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్థాన్ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.



